Vamshadara Distributary – 5 canal works were settled after three years
*3 సం.సమస్యకు పరిష్కారం*
పార్వతీపురం, మే 24 : వంశధార డిస్ట్రిబ్యూటరీ – 5 కాలువ పనులకు మూడు సంవత్సరాల తరువాత పరిష్కారం లభించింది. వివరాలను పరిశీలిస్తే భామిని మండలం పెద్ద దిమిలి గ్రామానికి సమీపంలో డిజైన్ ప్రకారం వంశధార వరద కాలువ నిర్మాణం జరగాలి. అయితే పెద్ద దిమిలి గ్రామస్తులు కాలువ నిర్మాణం వలన గ్రామంలో చెమ్మ వస్తుందని, కాలువలో ప్రమాదాలు జరగవచ్చని వివిధ సందేహాలతో గత మూడేళ్లుగా నిర్మించకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు వారికి పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ ససేమిరా అన్నారు. గ్రామం సమీపంలో నిర్మించాల్సిన దాదాపు ఆరు వందల మీటర్ల కాలువ మినహా మిగిలిన 1.20 కీలో మీటర్ల మేర నిర్మించారు. ఇంతలో జిల్లాల విభజన జరగటం, భామిని మండలం శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో చేరడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల గూర్చి సమీక్షలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఈ అంశాన్ని తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. పెద్ద దిమిలి గ్రామస్తులతో మాట్లాడాలని నిర్ణయించి మంగళ వారం ఒక సమావేశాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత సమక్షంలో సమావేశం జరిగింది. గ్రామస్తుల సంశయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆలకించారు. వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలో చెమ్మ రాకుండా అవసరమగు సిమెంట్ కట్టాడాలు నిర్మిస్తామని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాగు నీరు పారుదలకు సహకరించాలని కోరారు. వంశధార రాష్ట్రంలో ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టు అని, అటువంటి ప్రాజెక్టును చిన్న కారణాలతో నిలిపివేయడం సరికాదని సూచించడంతో గ్రామస్తులు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీనితో మూడు సంవత్సరాలుగా సాగుతున్న సమస్య యువ అధికారుల చొరవతో సానుకూలంగా పరిష్కారం జరిగి ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టుకు జిల్లాలో సజావుగా పనులు సాగుటకు అవకాశం కలిగింది. గ్రామంలో అవసరాలు గుర్తించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో పాలకొండ డిఎస్పి శ్రావణి, వంశధార కార్యనిర్వాహణ ఇంజినీర్ ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.