The first World Adivasi Day celebrations in Parvathipuram Manyam district were held in Seethampet on Tuesday.
*గిరిజన ఉత్పాదకాల మార్కెటింగ్ కు సహకారం*
పార్వతీపురం (సీతంపేట), ఆగస్టు 9 : గిరిజన ఉత్పాదకాల మార్కెటింగ్ కు సహకారం అందిస్తామని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సీతంపేటలో మంగళ వారం ఘనంగా జరిగాయి. పర్యాటక, ఉద్యాన, గృహ నిర్మాణ సంస్థ, ఇందిరా క్రాంతి పథకం, జీసీసి తదితర శాఖలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ గిరిజన సంప్రదాయం, ఆచారాలు తెలిసే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అంతకు ముందు వేడుకలకు హాజరైన అతిథులకు గిరిజన సంప్రదాయాల మేరకు ఆహ్వానం పలికారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య సవర నృత్యంలో పాల్గొని ఉత్సాహ పరిచారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య గిరిజన సాంప్రదాయంలో అలంకరణ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. భోరున కురుస్తున్న వర్షం కూడా సహకారం అందించి వేడుకలు ఘనంగా జరుపుటకు తోడ్పడింది.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్య మంత్రి ఉద్దేశ్యం అన్నారు. గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ కు సహకరిస్తామని చెప్పారు. పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలిలో భవనాలు నిర్మించి గిరిజన ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. విద్యా,వైద్యంలో అందరితో సమానంగా ఉండాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయుటకు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్య మంత్రి సీతంపేటలో సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసి గిరిజనులకు అత్యాధునిక వైద్యం అందించుటకు చర్యలు చేపట్టారని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని ఆయన చెప్పారు.
శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ గిరిజన మహిళా అభ్యున్నతి సాధించాలన్నారు. మహిళా వికాసానికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గిరిజన మహిళ అభ్యున్నతి ప్రధాన అంశంగా ఈ ఏడాది గిరిజన దినోత్సవం జరపడం ఆనందంగా ఉందన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మించాలని కోరారు. ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ చదివే విధంగా వసతి గృహాలలో కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.
శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ సూపర్ 60, టెట్ కోచింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ ఒక గొప్ప కార్యక్రమని పేర్కొన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ గిరిజన కుటుంబాలకు మంచి ప్రయోజనకరమన్నారు. గిరిజన పంటలకు మార్కెటింగ్ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని, విలువ ఆధారిత ఉత్పాదకాలు చేయాలని ఆయన సూచించారు.
రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ గిరిజనులు బాగా చదువకోవాలన్నారు. ఉన్నత హోదాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతం అందానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమని అన్నారు.
పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఆదివాసీ అంటే మంచి మనసు, పవిత్రం, స్నేహం, నమ్మకం, భరోసా అన్నారు. ఆదివాసీలు ప్రేమకు ప్రతి రూపం అన్నారు. ముఖ్య మంత్రికి ఆదివాసీలు అంటే అభిమానం అన్నారు. అటవీ భూమికి హక్కులు కల్పించారు. 1.35 కుటుంబాలకు 2.50 లక్షల ఎకరాలు పంపిణీ చేసారని ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో గిరిజన ప్రాంత రూపు రేఖలు మారుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఐటి, టెలికాం రంగాలను అభివృద్ధి చేయుటకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో 95 టవర్స్ రానున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగంలో మౌళిక సదుపాయాలు కల్పించడం కోసం రూ.159 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాడు నేడు పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు వచ్చిన ఉద్యోగ ఖాళీలను అప్పుడే భర్తీ చేయుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో రూ.150 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో పనులు చేయుటకు ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు జరిగిందని, మొత్తం రూ.90 కోట్లతో పనులు జరగనున్నాయని చెప్పారు. నాడు నేడు పనులు మొదటి విడతలో486 పాఠశాలల్లో రూ. 11 వందల కోట్లుతో చేపట్టడం జరిగిందని, రెండవ విడతలో రూ.5 వందల కోట్లతో పనులు జరగనున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు బాగా చదివి పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు ఆకాశమే హద్దు అని ఆయన ఉద్బోధించారు.
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య మాట్లాడుతూ 20 సబ్ ప్లాన్ మండలాల్లో 35 వేల మందికి కొండ పోడు పట్టాలు జారీ చేశామన్నారు. చిరు అటవీ ఉత్పత్తులను వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా మార్కెటింగకు చర్యలు చేపట్టామని తెలిపారు. గిరిజన ఉత్పత్తులను ప్యాకింగ్, బ్రాండింగ్ చేయుటకు సంబంధిత సంస్థ ద్వారా ఆమోదం పొందడం జరిగిందన్నారు. దీనికి రూ.50 లక్షలు నిధులు రానున్నాయని చెప్పారు. అనాస పంటకు మార్కెటింగ్ కల్పించుట రూ.5 కోట్లతో కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదనలు సమర్పించామని పేర్కొన్నారు. తాగు నీరు, రహదారుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
మహిళా సమాఖ్య అధ్యక్షులు బిడ్డక సరోజినమ్మ, వీరఘట్టం మండలంకు చెందిన ఆర్.ఓ.ఎఫ్ ఆర్ లబ్ధిదారులు నిమ్మక నాగేష్ తదితరులు తమకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు.
సీతంపేట, హడ్డుబంగి తదితర ఆశ్రమ ఉన్నత పాఠశాలల గిరిజన విద్యార్థులు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జి. మురళి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, గృహ నిర్మాణ సంస్థ ఇఇ రమేష్, గిరిజన సంఘం నాయకులు బిడ్డిక తేజేశ్వర రావు, ఆరికి మన్మధ రావు, కె.కాంతారావు, జెడ్పీటీసీ సవర లక్ష్మి,జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సవర లక్ష్మి, ఏఎంసి చైర్మన్ హెచ్.మోహన రావు, ఎం.పి.పి బి.ఆదినారాయణ, మండల ఉపాధ్యక్షులు కె.సరస్వతి తదితరులు పాల్గొన్నారు.