The district’s first Irrigation Advisory Council meeting decided to bring the kharif season ten days ahead in the district.
*పది రోజులు ముందుకు ఖరీఫ్*
పార్వతీపురం, మే 18 : జిల్లాలో ఖరీఫ్ సీజన్ ను పది రోజులు ముందుకు తీసుకు రావాలని జిల్లా మొట్ట మొదటి సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. తద్వారా నవంబరు, డిసెంబరు నెలలలో సంభవించే తుఫానుల నాటికి పంట పూర్తి అవుతుందని పేర్కొంది. సాగు నీటికి సంబంధించిన సివిల్ పనులు వేగవంతం చేయాలని సమావేశం తీర్మానించింది. సాగు నీటి ప్రాజెక్టుల పనులకు భూమి, ఇతర అంశాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కు వివరాలు అందించాలని నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్ కు నీరు అందించుటకు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లా మొట్ట మొదటి సాగునీటి సలహా మండలి సమావేశం గిరి మిత్ర సమావేశ మందిరంలో బుధ వారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు జూలై రెండవ వారం నాటికి సాగు నీరు విడుదల చేయాలన్నారు. వెంగలరాయ, పెద్ద గెడ్డకు లీకేజీలు ఉన్నాయని వాటిని అరికట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఎత్తి పోతల పథకాలు, మిని రిజర్వాయర్ ల ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం స్థాయిలో ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. లస్కర్ల నియామకానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రతిపాదించాలని ఆయన పేర్కొన్నారు. అవసరం మేరకు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు.
శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో సాగు నీటి చానల్స్ పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. నీలానగరం ఓపెన్ హెడ్ ఛానల్ కు ఇన్ పుట్ ఇవ్వాలని సూచించారు.
శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ సీతంపేట మండలంలో సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. నులకజోడు ఎత్తిపోతల పథకం, కొన్ని చెరువులు బాగు చేయడం వల్ల సాగు నీరు కల్పించడం జరుగుతుందని ఆమె సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా పలు పనులకు ప్రతిపాదించామని, ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయాలని ఆమె కోరారు.
శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ వరహాల గెడ్డ మిగులు నీటిని వినియోగించడం, జంజావతీ ప్రాజెక్టు నీటి వినియోగం జాప్యం జరగరాదని ఆయన పేర్కొన్నారు. బ్రాంచ్ కెనాల్స్ అవసరం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో అనేక నీటి వనరులు ఉన్నాయన్నారు. లస్కర్ల నియామకం ఆప్ కాస్ లో జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ బ్రాంచ్ కెనాల్స్ పనులు వేగవంతం చేయాలని అదేశించారు. సాగు నీటి విడుదల ముందుగా చేయడం వలన ఖరీఫ్ సీజన్ ముందుకు తేవాలని ముఖ్య మంత్రి సూచించారని తెలిపారు. తద్వారా నవంబరు, డిసెంబరు నెలలలో తుఫానులు వచ్చినా పంట నష్టపోవడం జరగదని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఆ కార్యక్రమం క్రింద చెరువుల పనులు చేపట్టవచ్చని తెలిపారు.
మేజర్ ప్రాజెక్టుల క్రింద వివిధ పనులు చేపట్టుటకు రూ.120 కోట్లతో ప్రతిపాదనలను జలవనరుల శాఖ తయారు చేసిందన్నారు.
*ప్రోటోకాల్ పాటించాలి*
అధికారులు ప్రజాప్రతినిధలు పట్ల విధిగా ప్రోటోకాల్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ పాటించడంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతోందని ప్రజా ప్రతినిధులు సభలో పేర్కొనగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చీఫ్ ఇంజినీర్ ఎస్. సుగుణాకర రావు మాట్లాడుతూ జంజావతి ప్రాజెక్టు పనులకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించామని అన్నారు. జిల్లాలో 24 వేల ఎకరాలు ఓపెన్ హెడ్ చానల్స్ క్రింద ఉన్నాయని తెలిపారు.
జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎన్.రాంబాబు మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజీ 1.897 టి.ఎం.సి సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 104 ఎఫ్.ఆర్.ఎల్ ఉందన్నారు. గతంలో ప్రతి ప్రాజెక్టులో లస్కర్లు ఉండేవారని,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ 1.82 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జలవనరుల శాఖ కార్య నిర్వాహక ఇంజినీర్లు ఆర్.అప్పల నాయుడు, శ్రీహరి రావు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.