Parvathipuram Manyam District Collector Nishant Kumar paid a surprise visit to the Makkuva Mandal market on Friday.
*గల్లీ గల్లీ తిరిగి.. పథకాలపై ఆరా తీసి*
* మక్కువ మార్కెట్ లో మన్యం కలెక్టర్*
పార్వతీపురం (మక్కువ), జూన్ 24 : మక్కువ మండల కేంద్రంలో గల మార్కెట్ లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్ర వారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ లోకి వచ్చిన వ్యక్తి ఒక అధికారి అని వ్యాపారస్తులు అనుకున్నారు కాని ఆయన ఎవరో వారికి తెలియదు. కలెక్టర్ వాహనం వెనుక తహశీల్దార్, ఎం.పి.డి.ఓ వుండటంతో పెద్ద అధికారి అనుకున్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ నేరుగా చిరువ్యాపారులు, కొనుగోలుదారుల వద్దకు వెళ్లారు. నేను కలెక్టర్ ను అని చెప్పారు. ఎందుకు వచ్చారో అని చిరు వ్యాపారులు కొద్ది సేపు గాబరా పడ్డారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చింది ఎందుకో తెలుసుకుని సంతోషించారు, కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించిన జిల్లా కలెక్టర్ అవి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైనా పథకాలు ఇంకా అందని వారు ఉంటే తెలియజేయాలని కోరారు. విభిన్నమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్న నిశాంత్ కుమార్ పేదలకు పథకాలు అందుతున్నాయో లేదో నిశితంగా పరిశీలించుటకు మార్కెట్ ను వేదికగా చేసుకున్నారు. శనివారం మార్కెట్లో చిరు వ్యాపారులతో మాట్లాడి వివరాలను కనుక్కున్నారు. సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న తోడు, చేదోడు వంటి పథకాల ద్వారా పొందిన ఆర్థిక సహాయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అర్హులుగా ఉండి పథకాలు అందకపోవడం లేదా సమస్యలు ఎదురు కావడం వంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల వలన పొందిన ప్రయోజనం, పథకాలు సద్వినియోగం చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. మార్కెట్ లో లబ్ధిదారులుగా ఉన్న చిరు వ్యాపారులు తాము పొందిన పథకాల వివరాలను వివరించారు. ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి లభించిందని దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పారు. పిల్లల చదువులు, కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. ప్రతి వ్యక్తి ప్రభుత్వ పథకాల వివరాలు సచివాలయంలో పొందవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ భాధ్యతగా వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ప్రజల స్పందన గ్రహించారు. సచివాలయంలో అన్ని సేవలను పొందవచ్చని, సమస్యల పట్ల అర్జీలు సమర్పించ వచ్చని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సామాన్య వ్యక్తి స్పందన తెలుసుకోవాలని మార్కెట్ లో ముఖాముఖి మాట్లాడామని చెప్పారు. ప్రభుత్వం మంచి పథకాలను అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరూ పొందాలని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు తమకు పథకాలు అందని పక్షంలో సచివాలయానికి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఇంటి వద్దకు అందిస్తున్న సేవలు పట్ల వాలంటీర్ల వైఖరిని పరిశీలించారు.
*ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి*
అనంతరం జగనన్న కాలనీ లేఅవుట్, తాహాసిల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జగనన్న కాలనీలో గృహాలు త్వరితగతిన ప్రారంభం కావాలని, వాటి నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగస్తులు ఉత్తమ సేవలను అందించాలని, ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన వ్యవస్థకు వన్నె తేవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రి సర్వే పనులు పూర్తి చేయాలని సూచించారు. స్వచ్ఛ సంకల్పంలో పరిశుభ్ర గ్రామాలు ఆవిర్భవించాలని అన్నారు. అపారిశుధ్య వాతావరణం ఉండరాదని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మక్కువ మండల తాహాసిల్దార్ డి. వీరభద్రరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్. సూర్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ సహాయ ఇంజనీర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.