Let’s do good to the people … Let’s give ease of administration … said the Deputy Chief Minister of the state Peedika Rajanna Dora
*ప్రజలకు మంచి చేద్దాం… పాలనా సౌలభ్యం అందిద్దాం…*
పార్వతీపురం, ఏప్రిల్ 25 : ప్రజలకు మంచి చేద్దాం… పాలనా సౌలభ్యం అందిద్దాం…అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పిలుపు నిచ్చారు. జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, అటువంటి మార్పులతో జిల్లా రూపు రేఖలు మారాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి మొట్ట మొదటి సమీక్షా సమావేశం సోమవారం గిరి మిత్ర సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు జిల్లాల విభజన జరిగిందన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్ళాలని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. త్వరలో జిల్లా సమీక్షా సమావేశం, ఐటిడిఏ పాలక మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. అటవీ ఉత్పత్తులు ఉన్నాయని వాటిని తగు రీతిలో మార్కెటింగ్ చేసి ఆదాయం సమకూర్చే విధంగా చేయాలని సూచించారు. జిల్లా సమస్యలు ఉన్నత స్థాయిలో పెట్టీ పరిష్కార రిద్దామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు బాగా అమలు చేయాలని అందుకు అర్హత ఒక్కటే చూడటం జరుగుతోందని ఆయన వివరించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనకర విత్తనాలు పంపిణి చేయాలని ఆయన సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జీడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం గూర్చి మాట్లాడుతూ ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై ప్రతిపాదనలు ఉన్నాయని వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని తద్వారా రహదారుల నిర్మాణం వలన రవాణా వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగు కావడం వలన వైద్య అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున జరగాలని, తద్వారా మెటీరియల్ కాంపొనెంట్ రాగాలదని ఆయన పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లా అని, అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని సూచించారు. గృహ నిర్మాణం, విద్య, వైద్యంకు ప్రాదాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కురుపాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో అభివృద్ది చెందాల్సి ఉందని ఆయన తెలిపారు. చెరకు పంట ఎక్కువగా ఉన్న ప్రాంతం అన్నారు. మిల్లింగ్ కు ప్రాధాన్యత ఉన్న రకాల వరి విత్తనాలను పంపిణి చేయుటకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. మొక్క జొన్న పైన రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. తాగు నీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో తాగు నీటి అవసరాలపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తుందని, ప్రత్యేక శ్రద్ద వహంచాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం పని ప్రారంభించడం జరిగిందన్నారు. పౌష్ఠికాహారం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో రానున్న రెండు సంవత్సరాలలో గట్టిగా పనిచేయుటకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో మాతృ, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, గర్భిణీల వసతి గృహాలు ఏర్పాటు చేసి పౌష్ఠికాహారం అందించడం, వైద్య పరీక్షలు చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఒక సర్వేలో 72 శాతం రక్త హీనత ఉండగలదని అంచనా ఉందని, తదనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల వారీగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనులు ఏ మేరకు చేపట్టడం వలన ఎంత వేతనం వస్తుందో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ఇ క్రాప్ విధానం పై దృష్టి సారించాలని అన్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సాగు నీటి కాలువల మరమ్మతులకు మంజూరు చేయాలని ఆయన సూచించారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో హెపటైటిస్ రోగులకు డయాలసిస్ చేయుటకు ఒక బెడ్ కావాలని, ఆక్సిజన్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. వీరఘట్టం రహదారి విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ లైన్ ల మార్పు, కాలువల నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ నియోజక వర్గంలో భామినిలో ఒక సార్టెక్స్ మిల్ మినహా ఏమి లేవని, ముందుగానే అన్ని సౌకర్యాలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎరువుల పంపిణీలో సైతం ఇబ్బంది ఉందని, భామిని మండలంలో కాటన్ పంట వస్తుందన్నారు. తాగు నీటి పర్యవేక్షణకు కనీసం ఇద్దరు జెఇలను సీతంపేట ప్రాంతంలో నియమించాలని కోరారు. సీతంపేట ప్రాంతంలో అర్హులైన లబ్దిదారులు ఉన్నారని వారి జాబిత తయారు చేసి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన 18 పంచాయితీలకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలన్నారు.
పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ఒడిశా నుండి అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకోవాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన అధికారి కే.ఎస్.ఎన్.రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్య నిర్వాహక ఇంజినీర్ ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మినాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, ఎపి హెచ్ఎంఐడిసి ఇఇ సూర్య ప్రభాకర్ తదితరులు తమ శాఖల ప్రగతిని వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు బి.నవ్య, ఆర్. కూర్మనాథ్, మునిసిపల్ చైర్ పర్సన్ గౌరీశ్వరి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు మరిశర్ల బాపూజీ నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకట రావు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, పాలకొండ మునిసిపల్ చైర్ పర్సన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.