It was believed that it was necessary to show affection towards patients. Along with that, Parvathipuram Manyam District Collector Nishant Kumar believes that he will recover quickly by providing better treatment.
*రోగులతో మమేకమై… బాధలు తెలుసుకున్న కలెక్టర్*
పార్వతీపురం, మే 18 : రోగుల పట్ల ఆప్యాయతను చూపించడం అవసరమని నమ్మారు. దానితో పాటు మెరుగైన వైద్యం అందించడం ద్వారా త్వరగా కోలుకుంటారని విశ్వసించారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. గుమ్మలక్ష్మిపురంలో బుధ వారం పర్యటించిన జిల్లా కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. రోగుల బాధలు తెలుసుకొనుటకు వారితో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, ఆహార నాణ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండటం వలన త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లవచ్చని మానసిక శక్తిని కలిగించారు. ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని, వచ్చే వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రభల కుండా దోమల నివారణకు స్ప్రేయింగ్ జరుగుతోందని, ప్రతి గృహం లోపల, బయట స్ప్రేయింగ్ చేయించు కోవాలని కోరారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ప్రతి శుక్ర వారం డ్రై డే పాటించాలని సూచించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను క్షుణ్నంగా పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ వైద్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఓపి విభాగం పేషెంట్ల సంఖ్య, ప్రసవాలు , వివిధ సీజన్లలో ఎక్కువగా నమోదు అవుతున్న వ్యాధులపై డాక్టర్ రవి కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. మెటర్నటీ విభాగం, ల్యాబ్ గదుల ఆధునీకరణ పనులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను ప్రశ్నించగా గైనకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ నియామకం జరగాలని వైద్యులు కలెక్టర్ కు తెలిపారు. ఉన్న సిబ్బందితో మెరుగైన వైద్యం అందించుటకు కృషి చేయాలని ఆయన అన్నారు. గిరిజన గ్రామాలకు కూడలిగా గుమ్మలక్ష్మి పురం ఉందని తదనుగుణంగా సేవలు అందించి హృదయాల్లో నిలవాలని పేర్కొన్నారు.
*సచివాలయాల తనిఖీ*
గుమ్మలక్ష్మిపురం 1, 2 గ్రామ సచివాలయాలను కలెక్టర్ తనిఖీ పరిశీలించారు. గ్రామ సచివాలయాల సిబ్బంది బయో మెట్రిక్ హాజరు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను పెండింగులో ఉంచకుండా సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు. రైతు భరోసా ఆకనాలడ్జేమెంట్, ఓ టి ఎస్ , మత్స్యకార భరోసా లబ్ధిదారులను గూర్చి ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల వేతనాల వివరాలు, పని దినాలు, బిల్లుల చెల్లింపు వివరాలు ఎంపీడీఓ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే. హేమలత, ఎమ్ పి డి ఓ సాల్మన్ రాజు, ఉప తాసిల్దార్ రాజేందర్,జాతీయ ఉపాధి హామీ పథకం ఏ పి ఓ శివరామ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.