Inspire… uplift the society… District Collector Nishant Kumar called upon the teachers.
*ప్రేరణ కల్పించండి… సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిండి…*
పార్వతీపురం, సెప్టెంబర్ 5 : ప్రేరణ కల్పించండి… సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిండి…అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఉన్నత లక్ష్యాల కోసం పనిచేయడమే కాకుండా భావిభారత పౌరులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దాలని కోరారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గిరి మిత్ర సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ ప్రధానం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించారని ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగానన్నారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ప్రజలకు మేలు చేయవచ్చని నా ఉపాధ్యాయుల మార్గదర్శకం చేయడంతో ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగాను అన్నారు. సమాజానికి మార్గదర్శకులుగా, ప్రామాణిక విద్యకు చిరునామాగా ఉపాధ్యాయులు నిలవాలని సూచించారు. ఉన్నత విలువలకు పాఠశాల ప్రథమ సోపానం కావాలని పిలుపునిచ్చారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కీర్తించారని చెప్పారు. రాధాకృష్ణన్ స్పూర్తితో జిల్లాలో ఆదర్శాలకు మారుపేరుగా ఉపాధ్యాయులు నిలవాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులకు సమస్యలు ఉంటే పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. అందరూ సమయాన్ని అనుసరించాలని, విద్యార్థులకు సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ముఖ హాజరుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులుగా సమాజానికి దిశాదశ నిర్దేశం చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొన్ని విద్యా సంస్థలలో బాలికల పట్ల వివక్ష, లైంగిక వేదింపులు జరుగుతున్నాయని, అటువంటి సంఘటనలలో ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. జిల్లాలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు నిబద్దతతో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అటువంటి కార్యకలాపాలు చోటు చేసుకొనుటకు అవకాశం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం మునిసిపల్ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.