Close

District Collector Nishant Kumar said there was a need to focus on maintaining hygiene during menstruation.

Publish Date : 30/05/2022
District Collector Nishant Kumar said there was a need to focus on maintaining hygiene during menstruation.

*ఋతుక్రమంలో పరిశుభ్రత ఆవశ్యం*

పార్వతీపురం, మే 28 : ఋతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యం ఉందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సాధికార శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవం శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పరిశుభ్రతపై యునిసెఫ్ రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రుతుక్రమం అనేది సాధారణ జీవప్రక్రియ అన్నారు. పునరుత్పత్తి వయసులో ఉండే అందరు స్త్రీలకు ఇది మామూలుగా సంభవిస్తుందని పేర్కొన్నారు. రుతుక్రమం గురించి మాట్లాడటానికి ఎవరూ బిడియ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశంలో పాఠశాలల్లో ఆడ పిల్లలకు అనుకూలమైన వసతులులేక 28 శాతం మంది బడి మానివేస్తున్నట్లు సర్వేలు ఉన్నాయని చెప్పారు. పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని, అందరికీ అవగాహన కల్పించాలని తద్వారా పాఠశాల పరిశుభ్రత, నిర్వహణతో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. తండ్రి, సోదరులు ఆడపిల్లలకు, మహిళలకు రుతుక్రమంపై సమగ్రమైన సమాచారాన్ని నైపుణ్యాలను అందించాలని పిలుపునిచ్చారు. అనవసర అపోహలతో ప్రతికూలమైన, హానికరమైన సామాజిక నిబంధనలను ఎదుర్కొంటున్నారని అన్నారు. నెలసరి సమయంలో పాటించవలసిన పరిశుభ్రతా పద్ధతుల గురించి అవగాహన లేకపోవటం వలన అనేక మంది వివిధ అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రుతుక్రమం సమయంలో శానిటరీ ప్యాడ్స్ వాడాలని, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి లేదా బాగా తడిగా అనిపించినప్పుడు పాడ్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సానిటరీ ప్యాడ్ మార్చుకున్నప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని పాడ్స్ ఎక్కడపడితే అక్కడ పడి వేయకుండా చెత్తకుండీలో వేయాలని లేదా ఇన్సినిరేటర్ లో కాల్చి వేయాలని కాల్ చెప్పారు.

జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి గొల్ల వరహాలు మాట్లాడుతూ అమ్మాయిలకు 8 నుండి 18 సంవత్సరాల వయసులో మొదటి రుతుక్రమం వస్తుందన్నారు. ఈ వయసులో అమ్మాయిల శరీరంలో మార్పులు జరుగుతాయని, శరీరంలో వస్తున్న మార్పులను గమనించి ప్రతినెల రుతుక్రమం తేదీలను గుర్తించుకోవాలని తద్వారా పరిశుభ్రతపై చర్యలు తీసుకోవచ్చని సూచించారు. నెలసరి సమయంలో విధిగా స్నానం చేయడం ఉత్తమమని, నెలసరి సమయాల్లో ఐరన్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే మంచి సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐరన్ మిళితం కావడానికి విటమిన్ సి ఉపయోగపడుతుందని అందుకే విటమిన్ సి కలిగిన ఆహారం, తీసుకోవాలని కోరారు. శాకాహారం, మాంసాహారం ఏదైనా తినవచ్చని చెప్పారు. నెలసరి సమయంలో నీరు ఎక్కువగా తాగాలని దాని వల్ల నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయ ని పేర్కొన్నారు. సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి ఉండదని వివరించారు. నెలసరి సమయంలో కొంత శారీరక బలహీనత ఉండే అవకాశం ఉందని, ఎక్కువ శారీరక శ్రమ ఉండరాదు అనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు పాటించడం జరుగుతోందని చెప్పారు. సమాజంలో కొంతమంది అపోహతో అపవిత్రంగా భావించడం జరుగుతుందని, ఇది అవసరం లేదని చెప్పారు. రుతుక్రమం సమయంలో సంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సమావేశాల్లో మామూలుగా పాల్గొనవచ్చని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు రాజేశ్వరి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.