Close

District Collector Nishant Kumar said that the voter registration program for graduates has started.

Publish Date : 04/10/2022
District Collector Nishant Kumar said that the voter registration program for graduates has started.

*పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం*

పార్వతీపురం, అక్టోబర్ 4 : పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం అయిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటరు నమోదు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో మంగళ వారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికలకు సంబందించిన షెడ్యూల్ విడుదల అయిందని చెప్పారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు ఫారం-18 సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటరుగా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి నవంబరు 7వ తేదీ వరకు నమోదు కావచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న పట్టభద్రుల ఓటరు జాబితా పూర్తిగా రద్దు చేయడం జరిగిందని, ప్రతి పట్టభద్రుడు కొత్తగా ఓటరుగా నమోదు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ceoandhra.nic.in వెబ్ సైట్ లో ను ఓటరుగా నమోదు కావచ్చని ఆయన చెప్పారు.

నవంబరు 23వ తేదీన ముసాయిదా ఓటరు జాబిత ప్రచురణ జరుగుతుందని, జాబితాపై అభ్యంతరాలు ఉంటే నవంబరు 23 నుండి డిసెంబరు 9వ తేదీ వరకు సమర్పించవచ్చు అన్నారు. అందిన అభ్యంతరాలను డిసెంబరు 25వ తేదీ లోగా పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. డిసెంబరు 30వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారని, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి ఈ.ఆర్.ఓగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

*ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో నమోదు కావాలి*

సాధారణ ఓటరు నమోదుకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. నవంబరు 19, 20 తేదీలు, డిసెంబరు 3,4 తేదీల్లో మరల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. అభ్యంతరాలు ఉంటే నవంబరు 9 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు సమర్పించవచ్చు అని తెలిపారు. డిసెంబరు 26వ తేదీ లోగా అభ్యంతరాలు పరిష్కారం జరుగుతుందని ఆయన చెప్పారు. 2023 జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురణ జరుగుతుందని ఆయన వివరించారు.

డిసెంబరు 31వ తేదీ లోగా ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆధార్ అనుసంధానం పూర్తిగా స్వచ్చంధమని, ఆధార్ నంబర్ ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఓటర్ల గుర్తింపు, ఓటర్ల జాబితా దృవీకరణ ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గంలలో లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఒకే వ్యక్తి పేరు నమోదు చేయడాన్ని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఫారం – 6బి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని, ఆధార్ ను ఆన్ లైన్లో దాఖలు చేయటానికి ఫారం ఆన్ లైన్లో ERONET, – 620 GARUDA, NVSP, VHA మొదలైన యాప్ లలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇ ఆర్ ఓ, ఏ ఇ ఆర్ ఓ, బి.ఎల్. ఓల ద్వారా ఆఫ్ లైన్ లలో కూడా ఫారం – 6బి ని పొందవచ్చని ఆయన చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయుటకు పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ జాబు కార్డు, ఫోటో కలిగిన బ్యాంకు, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, మినిస్ట్రీ అఫ్ లేబర్ వారి ద్వారా పొందిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్.బి.ఐ వారి ద్వారా గుర్తింపు పొందిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, పి.ఎస్.యు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల వారి ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన సేవా ఫోటో గుర్తింపు కార్డు, ఎం.పి, ఎం.ఎల్.ఎ, ఎం.ఎల్.సి ల ద్వారా పొందిన గుర్తింపు కార్డు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ అప్ ఇండియా వారి ద్వారా పొందిన గుర్తింపు కార్డు జత చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మరిసర్ల బాపూజీ నాయుడు, జరజాపు ఈశ్వర రావు, సిp ఐ (ఎం) రెడ్డి వేణు, తెలుగుదేశం ప్రతినిధి గొట్టాపు వెంకట నాయుడు, జనసేన ప్రతినిధి లక్ష్మి, సహాయ ఓటరు నమోదు అధికారులు తదితరులు పాల్గొన్నారు.