District Collector Nishant Kumar said that the services of engineers are crucial in the development of society and the creation of infrastructure
సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లది కీలక పాత్ర
జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలి
పార్వతిపురం, సెప్టెంబర్ 15: సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లు సేవలు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. గురువారం పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన ఇంజినీర్స్ డే వేడుకలలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలదండవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములైన ఇంజినీర్స్ అందరికీ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు, నీతి ప్రపంచ ఖ్యాతి పొందాయన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని దేశఅభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం లోనైనా ఇంజినీర్స్ సహకారం ఉంటుందన్నారు. సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లు కీలక పాత్ర పోసిస్తారని, మంచి ఇంజినీర్లు కనపరచిన పనితీరు ప్రజల జీవనం లో కనిపిస్తుందన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, మీ ఉద్యోగ కాలం లో చేపట్టిన పనులను, సేవలను ప్రజలు పదికాలాలు చెప్పుకొనేలా ఉండాలన్నారు. చేపట్టిన పనులలో నాణ్యత ఉండాలని, పనుల నాణ్యత భవిష్యత్తులో కూడా కనిపించాలని తెలిపారు . ప్రభుత్య భవనాలు స్వంత భవనాలుగా భావించి పనులు చేపట్టాలని, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. గ్రామాలలో చేపడుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షించాలని, లక్ష్యాలను పూర్తిచేసి జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేయాలన్నారు.
తమ సర్వీసులో విశేష సేవలందించిన విశ్రాంత ఇంజినీర్లు విజయకుమార్, లక్ష్మణ రావు లను ఈ సందర్బంగా సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన డిప్యూటీ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు , టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు అందించారు.
అనంతరం ఇంజినీర్స్ డే వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లకు చెందిన ఇంజినీర్లు పాల్గొనారు.