District Collector Nishant Kumar said that immediate steps are being taken to control the fever.
జ్వరాలు నియంత్రణకు చర్యలు
వై.ఎస్.ఆర్. గ్రామీణ వైద్యశాలలు ఏర్పాటు
పార్వతీపురం, జూలై 28: జ్వరాలు నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. గురువారం వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం .టి. కృష్ణబాబు, కమీషనరు జె.నివాస్ తో కలసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ వచ్చిన ప్రాంతాలలో తక్షణం రక్షణ చర్యలుచేపడుతున్నట్లు తెలిపారు. జ్వరాలు గుర్తించిన ప్రాంతాలలో దోమలు నియంత్రణకు స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఎనబై శాతం రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖలు, సచివాలయ సిబ్బందిని సమన్యయపరచి శానిటేషన్, శాంపిల్ కలెక్షను, ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన శాంపిల్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి, జిల్లావైద్య ఆరోగ్య అధికారి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. గ్రామీణ వైద్యశాలలు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆగష్టు నెలలో ప్రారంభించుటకు చర్యలుతీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం సంరక్షణ నిమిత్తం కుటుంబ డాక్టరు భావనతో ఈ పధకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి పి.హెచ్.సి. లో ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒకరు ఒ.పి. చూడగా మరొకరు క్షేత్రస్థాయిలో వై.ఎస్.ఆర్. గ్రామీణ వైద్యశాలలలో పనిచేయలన్నారు. ఉదయం ఒ.పి., మద్యాహ్నం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి దీర్ఝకాలిక వ్యాధిగ్రస్తులను, పాఠశాల విద్యార్థులకు, ఆరోగ్య శ్రీ పేషంట్లను తనిఖీ చేయాలని తెలిపారు. వై.ఎస్.ఆర్. గ్రామీణ వైద్యశాలలలో సిబ్బంది, మందులు కొరత లేకుండా చూడాలని తెలిపారు. 70 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఒ.ఆనంద్, డి.ఆర్.ఒ. వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి. జగన్నాధరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.