District Collector Nishant Kumar said that a target of one crore thirty four lakh working days has been set for the year 2023-24.
కోటి ముప్పైనాలుగు లక్షల పనిదినాలు లక్ష్యం
అడిగిన ప్రతి ఒక్కరికి పనికల్పించాలి
కనీసవేతనం 240 రూపాయలు కల్పించాలి
పార్వతీపురం, సెప్టెంబరు 30: 2023-24 సంవత్సరానికి కోటి ముప్పైనాలుగు లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరు సమావేశమందిరంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు, 2023-24 సంవత్సరానికి లక్ష్యాలు, ప్రణాళికపై డుమా అధికారులతో సమావేశంనిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈ సంవత్సరానికి ఇప్పటివరకు డబ్బది అయిదు లక్షల పనిదినాలు కల్పించారని, రానున్న నెలలలో మరొక డబ్బది అయిదు లక్షల పనిదినాలు కల్పించాలని తెలిపారు. 2023-24 సంవత్సరానికి కోటి ముప్పైనాలుగు లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. కనీస వేతనం రెండువందలనలబై రూపాయలు ఉండేటట్లు చూడాలన్నారు. కుల, వర్గాలకతీతంగా అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తెలిపారు. లక్షాలను పూర్తిచేయుటకు ప్రతినెలలో చేపట్టవలసిన పనులను ముందస్తు ప్రణాళిక తయారుచేసుకోవాలన్నారు. పనులకు సంబంధించిన ఫైలు మెయింటైన్ చెయ్యాలని, ఆడిట్ సమయంలో సమర్పించాలని తెలిపారు. ఫైల్ వర్కు ఏరోజుపని ఆరోజు పూర్తిచేయాలని, తద్వారా ఉన్నతాధికారులు అడిగినప్పుడు అవకతవకలకు వీలులేకుండా సరైన వివరాలు అందజేయగలరని తెలిపారు. పనులలో ఎటువంటి అవినీతి జరుగకూడదని, ఆడిట్ సమయంలో ఫైల్ తయారు చేసేవిధానం మానుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు పనులు చేపట్టాలని, వ్యక్తిగతంగా లబ్దిచేకూర్చి యితరులకు యిబ్బందిపెట్టె పనులు చేయకూడదని తెలిపారు. మండల అభివృద్ది అధికారులు ప్రతిపంచాయతీలోను చేపట్టేపనులను వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు మాట్లాడుతూ నైపుణ్యంలేని కూలీలకు కనీసం వందరోజులు పనిదినాలు కల్పించి వారి కుటుంబాలను ఆర్దికంగా ఆదుకొనుటకు ప్రభుతం ప్రవేశపెట్టిన ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పధకం ప్రవేశ పెట్టడం జరిగిందని, గ్రామాలలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, పనిదినాలు లక్షం పూర్తిచేయాలన్నారు. ప్రతినెలకు ముందుగానే చేపట్టవలసిన పనులు గుర్తించి ప్రణాళిక రూపొందించుకొనుట ద్వారా లక్ష్యం సాధించుటలో విజయం సాధించవచ్చునని తెలిపారు.
ఈ సమావేశంలో మండల అభివృద్ది అధికారులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.