District Collector Nishant Kumar ordered to speed up Anganwadi buildings in today’s program.
నాడు – నేడు కార్యక్రమంలో అంగన్వాడీ భవనాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. నాడు – నేడు అంగన్వాడి భవనల పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గురు వారం సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే తుది జాబితాగా మంజూరు చేసిన పనులు అన్నింటినీ తక్షణం మొదలు పెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం జారీ చేసిన 49 పనులకు తక్షణం రివాల్వింగ్ ఫండ్ జమ చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కార్యనిర్వాహక ఏజెన్సీలతో ఒప్పందం పూర్తి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత పనులకు తీర్మానాలు చేయడం, బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం, డి.ఇ.ఓ లాగిన్ కు రావడం అచ్చట నుండి రివాల్వింగ్ ఫండ్ విడుదల కావడం వరకు శుక్ర వారం నాటికి పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. జాప్యం చేసే వారి పట్ల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇన్ ఛార్జ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విజయ గౌరీ మాట్లాడుతూ మొత్తం 116 పనులు మంజూరు అయ్యాయని, వాటిలో తుదిగా 99 పనులు ఉన్నాయని చెప్పారు. తుడిగా నిర్ణయించిన పనుల్లో 49 పనులకు పాలనాపరమైన ఆమోదం జారీ చేయడం జరిగిందని అన్నారు. 17 పనులు వివిధ కారణాల రీత్యా మంజూరు జరగలేదని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, కార్యనిర్వాహణ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ఓ. ప్రభాకర రావు, జె. శాంతీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.