District Collector Nishant Kumar ordered to complete e-crop in the district in three days
*మూడు రోజుల్లో ఇ క్రాప్ పూర్తి చేయాలి*
పార్వతీపురం, సెప్టెంబర్ 13 : జిల్లాలో మూడు రోజుల్లో ఇ క్రాప్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలను ఇ క్రాప్ చేయాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఇ క్రాప్ చేయుటకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి ఇద్దరూ బాధ్యులేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉదయం చేపట్టుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఉద్యాన పంటలు ఎక్కువగా పెండింగులో ఉంటే క్రమ శిక్షణా చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఉద్యాన పంటలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇ క్రాప్ నమోదులో నిర్లక్ష్యం వహిస్తే షో కాజ్ నోటీసు, ఛార్జ్ మెమో జారీ తప్పవని ఆయన హెచ్చరించారు. మక్కువ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో మందకొడిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రానున్న మూడు రోజులలో ఇ క్రాప్ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మండలాల్లో మరణాల కేసులు, రైతుల వివరాలు లభ్యం కావడం లేదని వ్యవసాయ అధికారులు తెలియజేయగా ప్రతి ఒక్క పేరును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. వివరాలను పక్కాగా నమోదు కావాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ సహాయకుల సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూముల్లో ఇ క్రాప్ చేయుటకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువగా ఉండటం, వరదలు సంభవించడం వంటి సమయాల్లో వ్యవసాయ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. పంట నష్టం జరిగితే తక్షణ చర్యలు చేపట్టాలని, నష్ట అంచనాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఎరువుల గురించి మాట్లాడుతూ మండలాలకు రవాణా ఏర్పాట్లు పక్కాగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కౌలుదారుల గ్రూప్ లు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ మండలానికి మూడు డ్రోన్లు మంజూరుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఐదు గురుకు కలిపి ఒక డ్రోన్ మంజూరుకు, ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులకి డ్రోన్ ఫైలెట్ శిక్షణకు అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.