District Collector Nishant Kumar inspected the works of Visakhapatnam to Raipur National Highway on Tuesday.
*జాతీయ రహదారి పనులు పరిశీలించిన కలెక్టర్*
పార్వతీపురం/పాచిపెంట, ఆగష్టు 30: విశాఖ పట్నం నుంచి రాయ్ పూర్ జాతీయ రహదారి పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం పరిశీలించారు. విశాఖ పట్నం నుంచి రాయ్ పూర్ వరకు జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ (ఎక్స్ స్స్ కంట్రోల్ ఎక్స్ప్రెస్) జాతీయ రహదారి పనులను పాచిపెంట మండలం ఆలూరు, రామభద్రా పురం మండలం కొండ కింగువ వద్ద మంగళ వారం పరిశీలించారు. హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ చేపడుతున్న ఆలూరు నుంచి జక్కువ వరకు సుమారు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆరు వరుసల జాతీయ రహదారి పనుల వివరాలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు మ్యాప్ ద్వారా ప్రతిపాదిత రహదారి వివరాలను వివరించారు. ప్రాజెక్ట్ పనులు నిర్వహణలో అటవీ ప్రాంతానికి సంబందించి అటవీశాఖ అనుమతులు, కాలువల నిర్మాణాలకు అవసరమైన జలవనరుల శాఖ అనుమతులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరం మేరకు సహకారం అందిస్తామని అన్నారు. రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి రాజశేఖర్ మాట్లాడుతూ 12 కిలో మీటర్ల మేర ఇప్పటికే పనులు ప్రారంభించామన్నారు. మిగిలిన మొత్తానికి పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రహదారి ప్రక్కన వివిధ వసతులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ మాల పరియోజన క్రింద జాతీయ రహదారి 130 సిడి గా రహదారిని నిర్మించడం జరుగుతోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కన్సల్టింగ్ టీమ్ లీడర్ జి.పి.మద్దిలేటి, తాసిల్దార్ ఎమ్.రాజశేఖర్, ఎం పి డి ఓ జే.ఉమామహేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి.రామచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.