District Collector Nishant Kumar has called for the prevention of diseases in the district.
జిల్లాలో వ్యాధుల భరతం పట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ అంశంపై ఏ.ఎన్.ఎంలకు స్థానిక జనహిత కళాశాలలో మంగళ వారం శిక్షణా కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ శిక్షణా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా ప్రతి వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా వర్షాకాలంలో అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉంటాయని వాటి పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, అతిసార వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కేన్సర్, కిడ్నీ సమస్యలు వంటి అంటు వ్యాధులు కాని రోగాలపైనా అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాధుల పట్ల అవగాహన లేపోవడంతో అనేక మంది వాటికి గురి అవుతారని జిల్లా కలెక్టర్ అన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలు తెలియజేయాలని సూచించారు. వేడి ఆహార పదార్థాలు, బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని తద్వారా ఆనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ అంశంతో తరచూ గ్రామాల సందర్శన ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుటకు ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమానికి రూప కల్పన చేసిందని జిల్లాలో విజయవంతంగా అమలు చేసి ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. ఇందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు కీలకమని కలెక్టర్ చెప్పారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజలకు చేరువగా ఉంటారని ఆయన పేర్కొంటూ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు అధ్యయనం చేయాలని వాటిపై సమగ్ర సూచనలు చేసి అనారోగ్యం భారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఉద్బోధించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమగు మందులు, సూచనలు, సలహాలు అందజేయాలని, తరచూ వైద్య పరీక్షలు పొందాలని ఆయన పేర్కొన్నారు. ప్రసవ తేదీకి కొద్ది రోజులు ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలని చెప్పారు. ఎక్కువ సార్లు గర్భం ధరించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని, అటువంటి వాటిని గుర్తించి తగు సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని – ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి. జగన్నాథ రావు మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్య అధికారి, ఏ.ఎన్.ఎం, ఆశా, ఎం.ఎల్ హెచ్.పి బృందంగా పర్యటిస్తారని చెప్పారు. ఆగష్టు 15వ తేదీ నుండి దీనిని అమలు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మ్యునైజేశన్ అధికారి టి.జగన్మోహన్, డెప్యూటీ డి.ఎం.హెచ్.ఓ అనిల్, ఎన్.జి. ఓ ప్రతినిధి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.