District Collector Nishant Kumar directed the officials to keep a special vigil at the borders to prevent illegal movement of fertilizers to neighboring states.
ఎరువులు పక్క రాష్ట్రాలకు ఆక్రమంగా తరలిపోకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి వ్యవసాయ అనుబంధ శాఖల మండల స్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతులకు విత్తనాలు ఎరువులు పంపిణీ పారదర్శకంగా జరగాలన్నారు. మార్కెట్లోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్ కు మించి నిల్వచేసిన, ఎమ్ అర్ పి రేట్లకు మించి అధిక ధరలకు విక్రయించిన 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎరువులు పక్కదోవపడితే సహించేదిలేదని, కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రెండు నెలలు ఎరువులు, విత్తనాల పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని అన్నారు. కౌలు రైతులకు వెంటనే రుణ అర్హత కార్డులు జారీ చేయాలని, జారీ అయిన కార్డులను వై ఎస్ ఆర్ అర్ బి పోర్టల్ లో తక్షణమే నమోదు చేయాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకుల స్థాయిలో పెండింగ్ ఉండరాదన్నారు. పిఎం కిసాన్ పథకంలో గిరిజనులకు అర్ ఓ ఎఫ్ అర్ క్రింద పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలు నెలాఖరులోగా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పసుగ్రాసంకి సంబందించి టి.ఎమ్.అర్ కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈ.ఈశ్వర రావు ను ఆదేశించారు. ఉద్యాన వన రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యానవన అధికారి కె.సత్యనారాయణ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి తిరుపతి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు టి.వెంకటేష్, కొమరాడ, జి.ఎల్.పురం వ్యవసాయ అధికారులు పి.శంకర రావు, జి.షణ్ముఖ రావు, ఎమ్ ఈ ఏ అర్.రేఖ, తదితరులు పాల్గొన్నారు.