District Collector Nishant Kumar directed the officials to conduct e-Crop registration separately for the crop grown by the farmer.
*ఇ క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలి*
పార్వతీపురం (పాచిపెంట), ఆగస్టు 24 : రైతు పండించిన పంటకు ఇ- క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాచిపెంట సమీపంలోని పత్తి పంట ఇ క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతు పండించిన పంట, ఏ సమయంలో వేసింది , ఇ క్రాప్ నమోదు యాప్ లోని వివరాలను, గ్రామ వ్యవసాయ సహయకురాలు అశ్వినీ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇ క్రాప్ నమోదు ఎంతమేర జరిగిందని కలెక్టర్ ప్రశ్నించగా పాచిపెంట సచివాలయం పరిధిలోని 205 ఎకరాల వరకు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎరువులు, యూరియా సక్రమంగా అందుతున్నది లేనిది, పంట చేతికి అందాక ఏ విధంగా మార్కెట్ చేస్తున్నదీ అనే విషయాలను రైతు గండి గుప్తేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాల్లో సరఫరా చేసిన ఎరువులను, యూరియాను వినియోగించుకున్నట్లు రైతు చెప్పారు. అర్హత మేరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తించేందుకు ప్రతీ రైతు పంటను ఇ క్రాప్ లో నమోదు అయ్యేలా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
*అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి*
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పాచిపెంట లోని నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాల పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి వీలైనంత త్వరగా నూతన భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు పాలనా సౌలభ్యం అందించాలనే లక్ష్యంతో ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అక్కడ నుంచి గ్రామ సచివాలయాలను సందర్శించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల వివరాల జాబితాను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు కాల పార్వతీ తో మాట్లాడి ఇంటి సామాగ్రి, సిమెంట్ ఎన్ని బస్తాలు అధికారులు అందించారు అనే వివరాలపై ఆరా తీశారు. గృహ నిర్మాణ బిల్లు మంజూరు అయ్యిందా అని ప్రశ్నించగా రూ.75 వేలు మంజూరైందని తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జల జీవన్ మిషన్ క్రింద చేపట్టిన ఇంటింటికీ కుళాయిలు లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి.సంతోష్, ఇంచార్జి తాసిల్దార్ ఎమ్.రాజశేఖర్, పంచాయత్ రాజ్ డి ఈ చిన్నం నాయుడు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మధుసూదన రావు, వ్యవసాయ అధికారి అనురాధ, ఏ ఈ ఓ హైమవతి, తదితరులు పాల్గొన్నారు.