District Collector Nishant Kumar clarified that there should be no compromise on quality in housing construction
*నాణ్యతలో రాజీ లేదు*
పార్వతిపురం (బలిజిపేట, సీతానగరం), జూన్ 3 : గృహ నిర్మాణంలో నాణ్యతలో రాజీ ఉండరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. బలిజిపేట, సీతానగరం మండలాల్లో జిల్లా కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయాలు, గృహ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని ఆయన స్పష్టం చేశారు. గృహ నిర్మాణాల నాణ్యతలో రాజీ లేదని మంచి ఇసుక, సిమెంట్, ఇనుము లబ్ధిదారులకు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులను సరైన విధంగా చైతన్యపరిచి వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా గృహాలను మంజూరు చేయడం జరిగిందని, వాటిని త్వరగా నిర్మించుకుని సొంత ఇంటికి యజమానులు కావాలని కోరారు. ప్రస్తుతం పనులు చేసుకునే అవకాశం ఉందని, ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేయడం ఉత్తమమని సూచించారు. బిల్లులు వెంటనే చెల్లించడం జరుగుతోందని పేర్కొన్నారు. విలువైన స్థలాలు లబ్ధిదారులకు పంపిణీ జరిగిందని, ఇళ్ల నిర్మాణం వల్ల లక్షలాది రూపాయల ఆస్తికి వారసులు, హక్కుదారులు అవుతారని కలెక్టర్ చెప్పారు. సొంత ఇల్లు ఉండటమనే కలను నిజం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. గృహ నిర్మాణాలు లే అవుట్ లో ఉండడం వలన మంచి వాతావరణం ఉంటుందని, పిల్లలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. లబ్ధిదారులను చైతన్య పరచడంలో గృహనిర్మాణ సంస్థ, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రముఖ పాత్ర వహించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు సేవలందించడంలో మిన్నగా ఉండాలని అన్నారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది హాజరు, పనితీరు, ప్రభుత్వ పథకాల సమాచారం, అందుబాటులో లబ్ధిదారుల వివరాలు తదితర అంశాలను పరిశీలించారు. అర్హులైన వారు జాబితాలో విధిగా ఉండాలని, జాబితాలో తప్పిపోవడానికి వీల్లేదని, సామాజిక తనిఖీ స్పష్టంగా ఉండాలని చెప్పారు. ప్రజల నుండి వస్తున్న స్పందన అర్జీలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామ సచివాలయాల నిర్మాణం వేగవంతం కావాలని ఆయన అన్నారు. గ్రామాల్లో నాటు సారా తయారీ, ఇతర అసాంఘిక కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలని పోలీసు అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, తాసిల్దార్లు, గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.