Close

District Collector Nishant Kumar said that tourism should flourish in the district

Publish Date : 29/09/2022
District Collector Nishant Kumar said that tourism should flourish in the district

*జిల్లాలో పర్యాటకం శోభిల్లాలి*

పార్వతీపురం, సెప్టెంబర్ 28 : జిల్లాలో పర్యాటకం శోభిల్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో ఎకో టూరిజం క్రింద గిరిజన ఒకటి, రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులు ఒక రోజు గ్రామంలో గడిపి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద కన్వెన్షన్ సెంటర్, వ్యూ పాయింట్, ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఇందుకు పార్వతీపుం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులతో సహా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్, రివర్ ఫ్రంట్ కాటేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బ్యాటరీ ట్రైన్ సౌకర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించుటకు అవకాశాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పర్యాటక, జాతీయ రహదారి కలుపుతూ తూర్పు కనుమల కారిడార్ (ఈస్టర్న్ ఘాట్స్ కారిడార్) ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని, సామాన్య ప్రజల ఆదాయం వృద్ది చెందగలదని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెండు నుండి ఐదు ఎకరాల స్థలంలో శిల్పారామం, బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో టూరిజం కార్పొరేషన్ డివిజన్ (ఎకో టూరిజం) కార్యాలయం, డెప్యూటీడిఇ , ఏఇలతో కూడిన టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. పర్యాటక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక విశేషాలు తెలియజేస్తూ వెబ్ సైట్ రూపొందించాలని, ఇతర ప్రధాన వెబ్ సైట్లుతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

2.పత్రికా ప్రకటన

*3వ తేదీన దసరా ఉత్సవాలు*

పార్వతీపురం, సెప్టెంబర్ 28 : దసరా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీన జిల్లాలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి చేనేత వస్త్ర ప్రదర్శన – విక్రయం, గిరిజన సాంప్రదాయ వస్తువుల ప్రదర్శన, వన్ ధన్ కేంద్రాల ఉత్పత్తులు, సవర కళాకృతుల ప్రదర్శన, జీసిసి ఉత్పత్తులు, ఆప్కో, అటవీశాఖ, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన, ఆహార పదార్థాల విక్రయ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటవస్తువులు ఏర్పాటు, బాణసంచా తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 3వ తేదీ మధ్యాహ్నం నుండి కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయం చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.