District Collector Nishant Kumar visited elephant migration spots in Komarada mandal Daliapet on Sunday.
*ఏనుగుల సంచార గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్*
పార్వతీపురం, ఆగస్టు 28 : కొమరాడ మండలం దలైపేటలో ఏనుగుల సంచార ప్రదేశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆది వారం సందర్శించారు. ఏనుగుల వలన పంట నష్టం జరుగుతోందని, ప్రాణ భయం ఉందని ఆ ప్రాంత వాసులు కొద్ది రోజులుగా తెలియ జేస్తుండటంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించారు. గ్రామస్తులు ఏనుగులను తరలించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. పంట నష్టం సకాలంలో వచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. అటవీ శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ సంయుక్తంగా పరిశీలించడం వలన కొద్దిగా జాప్యం జరుగుతోందని దానిని నివారించుటకు ప్రయత్నిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏనుగుల తరలింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏనుగుల సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకొనుటకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అటవీ శాఖ అధికారులు అందిస్తున్న సమాచారాన్ని పాటించాలని, ఏనుగులను టీజింగ్ చేయరాదని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
కురుపాం అటవీ రేంజర్ మరియు ఏనుగుల పునరావాస కేంద్రం ఆర్.రాజ బాబు మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక నుండి నిపుణులైన మావాటి వారు, శిక్షణ పొందిన ఏనుగులు రావల్సి ఉన్నాయని, ప్రతిపాదనలు సమర్పించామని వివరించారు. చందలాడ వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటుకు కూడా గతంలోనే ప్రతిపాదనలు సమర్పించామని ఆయన చెప్పారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఏనుగుల సమాచారం అందించుటకు 24 గంటలు పని చేసే రెండు బృందాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, పోలీస్, రైల్వే అధికారులతో సమాచారం బదిలీ చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. పంట నష్టానికి సంబంధించి రూ.9 లక్షలు పెండింగ్ లో ఉందని తెలిపారు.
ఈ పర్యటనలో అటవీ అధికారి అవతారం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.