District Collector Nishant Kumar said that the tricolor flag is a symbol of independence.
త్రివర్ణ పతాకం స్వాతంత్ర్యనికి చిహ్నమని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రెండవ రోజు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ప్రముఖ నాటక కర్త బళ్లారి రాఘవ జయంతి కార్యక్రమాలను కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశ భక్తుడు అన్నారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకం ఉండాలని కోరుకున్న వ్యక్తులలో ఒకరని, ఆ మేరకు వివిధ పతాకాలను అధ్యయనం చేసి వివిధ నమూనాలు తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. 1916 సంవత్సరంలో దేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని రచించారని అన్నారు. 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహా సభలలో మహాత్మా గాంధీ కోరిక మేరకు పతాకాన్ని రూపొందించారని ఆయన వివరించారు. పింగళి వెంకయ్య గొప్ప దేశ భక్తుడు మాత్రమే కాదని వ్యవసాయం, పారిశ్రామిక, పరిశోధనా రంగాల్లో విశేష ఆసక్తి కలిగిన వ్యక్తి అన్నారు. పింగళి వెంకయ్య భావితరాలకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అని, ఆయన చూపిన వ్యవసాయ, పరిశోధనా రంగాలలో యువత నడిచి ఉజ్వల భారత భవితకు కృషి చేయాలని కోరారు.
*బళ్ళారి రాఘవ కళా రంగానికి ఆదర్శం*
బళ్ళారి రాఘవ కళా రంగానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ అన్నారు. బళ్ళారి రాఘవ న్యాయవాదిగా ఉంటూనే నాటకాలలో విశ్వ విఖ్యాతి చెందారని చెప్పారు. నాటక రంగం పట్ల అభిరుచి, అనురాగం పెంచుకుని తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారని చెప్పారు. న్యాయవాదిగా, నాటక కర్తగా ఉంటూనే ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. హరిజన పాఠశాలను ఏర్పాటు చేసి వారి విద్యాభ్యాసానికి తోడ్పడ్డారని అన్నారు. సాహిత్యం, కలలను ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.