Close

District Collector and District Electoral Officer Nishant Kumar said that the Election Commission provides an opportunity to register as a voter four times a year.

Publish Date : 02/08/2022
District Collector and District Electoral Officer Nishant Kumar said that the Election Commission provides an opportunity to register as a voter four times a year.

*ఓటరుగా నమోదుకు ఏడాదిలో నాలుగు అవకాశాలు*

పార్వతీపురం, ఆగస్టు 1 : ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం సంవత్సరంలో నాలుగు సార్లు అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వివరించారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇకపై ఓటర్ల జాబితాను ప్రతీ త్రైమాసికంలో తాజా పరచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన యువత నమోదు చేసుకున్న అనంతరం వారికి ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఐపిఐసి)ను జారీచేస్తారని ఆయన చెప్పారు. 2023 ఓటర్ల జాబితా వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో 2023 సంవత్సరం ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకునే వారు ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు సమర్పించవచ్చని ఆయన సూచించారు. జనవరి 1వ తేదీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వలన 18 సంవత్సరాలు నిండినప్పటికి పలు ఎన్నికలలో యువత ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 1950 ఆర్పి చట్టంలోని 14(బి) విభాగంలో న్యాయ సవరణలను, 1960 ఓటర్ల రిజిస్ట్రేషన్ నియమావళిలోని పర్యవసాన సవరణలను భారత ఎన్నికల సంఘం – శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గం ఓటరు జాబితాను రూపొందించడం, సవరించడం కోసం అవసరమైన మార్పులను చేపడుతుందని ఆయన చెప్పారు.

*ఆగష్టు 1 నుండి కొత్త దరఖాస్తులు*

ఓటరు నమోదు ఫారాలు మరింత సులభంగా రూపొందించి ఆగష్టు 1వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకువస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఓటరుగా నమోదుకు ఫారం – 6, పేరు తొలగింపుకు ఫారం – 7, వివరాలను సరిదిద్దడానికి ఫారం -8, ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం చేయడానికి ఫారం – 6బి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ఓటరు హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేయవచ్చని లేదా www.NVSP.in లో లాగిన్ కావచ్చని చెప్పారు. ఇప్పటికే పాత నమూనా దరఖాస్తులో దాఖలు చేసిన వారు కొత్తవి సమర్పించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ లో ప్రారంభం కానున్న సవరణ కార్యకలాపాల్లో ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ క్రింద ముసాయిదా ఓటర్ల జాబితాలో క్లెయింటు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక నెల వ్యవధి అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

*ఇపిఐసి – ఆధార్ అనుసంధానం*

ఓటరు జాబితాతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడానికి, ఓటర్ల ఆధార్ వివరాలను కోరేందుకు సవరించిన 6బి ఫారం ను సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందం మాత్రమే అని, బలవంతం లేదని ఆయన అన్నారు. ఆధార్ అనుసంధానం చేయని వారు ఇతర నిర్దేశిత 11 రకాల గుర్తింపు కార్డులను అనుసంధానం చేయవచ్చని తెలిపారు. ఆధార్ అనుసంధానం వలన కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని ఆయన అన్నారు. గత ఎన్నికలలో వృద్ధులకు, దివ్యాంగులకు ఉచిత రవాణా కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయనప్పటికి ఓటర్ల జాబితా నుండి తొలగించడం జరగదని ఆయన వివరించారు. అనుసంధాన ప్రక్రియ 2023 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.

*సెప్టెంబరు 4 నుండి ప్రత్యేక శిబిరాలు*

సెప్టెంబరు 4 నుండి ఓటరు అవగాహన ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి నెల రెండవ ఆది వారం బూత్ స్థాయిలో ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారి ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. క్షేత్ర పరిశీలనను ఎన్నికల యంత్రాంగంలోని సూపర్ వైజర్లు, ఇఆర్ లు, ఎఇఆర్ ఓ లు, వివిధ స్థాయిలలోని అధికారులు నిర్వహిస్తారని తెలిపారు.

అంతక ముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఓటరు నమోదు కార్యక్రమం వివరాలపై అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున ఓటరుగా నమోదుకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన 6బి ఫారం ను విడుదల చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, వివిధ పార్టీల ప్రతినిధులు – ద్వారపురెడ్డి శ్రీనివాస్, టి.వెంకట రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.