District Collector Nishant Kumar said that the district should take steps industrially.
*పారిశ్రామికంగా అడుగులు పడాలి*
* జిల్లాలో పరిశ్రమలకు అపార అవకాశాలు
* పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు
పార్వతీపురం, జూన్ 15 : జిల్లా పారిశ్రామికంగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పుటకు అవసరం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు వలన స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వలసల నివారణకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి వలన ఆర్థిక అభ్యున్నతికి అడుగులు పడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిఐఇపిసి) సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఉన్న ప్రోత్సాహకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు జిల్లాకు రావాల్సి ఉందని ఆయన పేర్కొంటూ జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు జరుగుతుందని ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీతంపేట ప్రాంతంలో అనాస, జీడి మామిడి పంట విస్తారంగా ఉందని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రానున్న ఒకటి, రెండు సంవత్సరాల్లో పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ముందంజలో ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలో రెండు జాతీయ రహదారులు, రైల్వే లైన్ అభివృద్ధి పనులతో పాటు అందుబాటులో భోగాపురం ఎయిర్ పోర్టు, విశాఖ పోర్టు ఉండటం వలన ఎగుమతి, దిగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సరైన ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు దరఖాస్తులు చేసిన వారికి నిర్దేశిత సమయంలో మంజూరు పత్రాలను జారీ చేయాలని, తిరస్కరించిన వాటికి స్పష్టమైన కారణం తెలియజేయాలని ఆయన చెప్పారు. వైయస్సార్ జగనన్న బడుగు వికాసం, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పిఎం.ఇ.జి.పి) క్రింద ఎస్సీ, ఎస్టీ, మహిళ పారిశ్రామికవేత్తలకు తయారీ పరిశ్రమలకు రూ.50 లక్షల వరకు, సేవారంగలో పరిశ్రమల ఏర్పాటుకు రూ.20 లక్షల వరకు రుణ సహకారం ఉందని చెప్పారు. పిఎంఈజిపి క్రింద ఎస్సీ, ఎస్టీ మహిళ, ఈబిసి, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు తదితర వర్గాలకు గ్రామీణ ప్రాంతంలో 35 శాతం, పట్టణ ప్రాంతంలో 25 శాతం, ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో 25 శాతం, పట్టణ ప్రాంతంలో 15 శాతం మార్జిన్ మనీ ఉందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు. మండలాల నుండి ఎస్సీ, ఎస్టీ, మహిళ వర్గాల నుండి కనీసం ఒక్కొక్క దరఖాస్తును మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలు ఏర్పాటుకు ముందుగా సంబంధిత మార్కెటింగ్ వ్యవస్థను పరిశీలించాలని అందుకు తగిన సహాయ సహకారాలు సంబంధిత శాఖలు అందించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. సమగ్ర పరిశ్రమల సర్వే ను 10 రోజుల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చింతపండు పిక్క తీసే యూనిట్లు ఏర్పాటుకు రుణాలకు సమర్పించిన దరఖాస్తుల జాబితాను అందజేయాలని కలెక్టర్ జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు సీతారాం మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల పరిస్థితిని వివరించారు. ఉద్యమం పథకం కింద ప్రతి పరిశ్రమ ఆన్లైన్లో నమోదు కావాలని ఆయన చెప్పారు.
రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధి విజయ శంకర్ రాజు మాట్లాడుతూ జిల్లాలో రైస్ మిల్లులకు సరైన సహాయాన్ని అందించాలని కోరారు. జిల్లాలో 70 మిల్లులు సార్టెక్స్ మిల్లులుగా మార్పు చేయుటకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. ల్యాండ్ కన్వర్షన్ ను సింగిల్ విండో లో పెట్టడం వలన అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.
ఈ సమావేశంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి పి.హరీష్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ యతిరాజులు, సహాయ ఎల్డిఎం ప్రత్యూష, ఎమ్ ఎస్ ఎంఇ మేనేజర్ చంద్రమౌళి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రతినిధి కృష్ణ వర్మ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, ఐపిఓ కిరణ్, జిల్లా డ్రగ్స్ నియంత్రణ అధికారి లావణ్య, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి గయాజుద్దీన్,
చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి పివీఎస్ రామ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.