Prime Minister Narendra Modi has said that the main objective is to provide government and welfare development programs introduced by the central government to every eligible beneficiary.
* పథకాలు సద్వినియోగం చేసుకోండి… ఆర్ధికంగా అభివృద్ధి పథంలో నడవండి..*
పార్వతీపురం, మే 31 : అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడమే ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రజా సంక్షేమ పథకాల లబ్దిదారులతో మాటామంతీ మరియు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద 10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21 వేల కోట్లకు పైగా నిధులను 11వ విడత క్రింద నగదు బదిలీ కార్యక్రమం మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ లో పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలకు అనుసంధానం చేశారు. పథకాలు అందుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. “మేము అందించే పథకాలతో మీరు అభివృద్ది చెందడమే కాకుండా పలువురికి జీవనోపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందని” లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు. భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు అందించారని ఆయన పేర్కొన్నారు. “ఈ పథకాలు మోడీ అందించారు అనుకోవద్దని, 130 కోట్ల ప్రజలు ఎన్నుకోవడంతో నాకు ఇటువంటి అవకాశం కలిగిందని” అన్నారు. ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సేవా భావం, పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. శాశ్వత సమస్యలు అనుకున్న వాటిని పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల బీమా అందజేయడం జరిగిందని, 200 కోట్ల వాక్సిన్లు వేయించడం జరిగిందని చెప్పారు. జల జీవన్ మిషన్ పథకం క్రిందప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పి.ఎం ముద్ర పథకం ద్వారా పలువురు ఉపాధి పొందారని చెప్పారు. భారత్ లో పేదరిక శాతం తగ్గుతుందని, దేశంలో అన్ని రకాల ఉత్పత్తులు జరిగి మార్కెట్లో వస్తే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భారత్ ఆర్థికంగా అభివృధి చెందే దేశాలలో ముందుందన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ), ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన, పోషన్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ, పట్టణ), జల్ జీవన్ మిషన్ మరియు అమృత్, ప్రధాన మంత్రి ఎస్.వి.ఏ నిధి పథకం, ఒకే జాతి ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డు), ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్ పి.ఎం జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాలపై ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
పార్వతీపురంలో గిరి మిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,
పాల్గొన్నారు.
జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 24,619 గృహాలు మంజూరు కాగా 4,574 గృహాలు గ్రామీణ విభాగంలో, 2016 టిడ్కో గృహాలు మంజూరు అయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద 2021 – 22 సంవత్సరంలో మొదటి విడతలో 78,872 మంది రైతులకు రూ.15.77 కోట్లు, రెండవ విడతలో 77,441 మందికి రూ.15.49 కోట్లు, మూడవ విడతలో 65,210 మందికి రూ.13.04 కోట్లు విడుదల అయ్యాయి. 2019 సంవత్సరం నుండి ఏడాదికి రూ.6 వేలు చొప్పున అందిస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన క్రింద 38,950 మంది లబ్ది పొందుతున్నారు. జల్ జీవన్ మిషన్ క్రింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 2,21,444 గృహాలకు తాగు నీరు సరఫరా చేయుటకు ప్రతిపాదించగా 20 – 21 సంవత్సరంలో 92,521 గృహాలకు, 2022 – 2023 సంవత్సరంలో 91,902 గృహాలకు ప్రతిపాదించి పనులు చేపడుతున్నారు. ప్రధాన మంత్రి ఎస్.వి.ఏ నిధి పథకం క్రింద 2020 – 21 సంవత్సరంలో 1226 మందికి, 2021 – 22 సంవత్సరంలో 1106 మందికి మంజూరు చేసారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద 15,411 మందికి రూ.93.17 కోట్లను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, డి.ఆర్.డి.ఏ పిడి వై. సత్యం నాయుడు, మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా సరఫరా అధికారి మధుసూదన రావు, ఇతర అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.