The district collector on Monday held a video conference with zonal officials on housing, registrations, employment guarantee, etc.
*లక్ష్యాలు సాధించాలి*
పార్వతీపురం, మే 30 : నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గృహ నిర్మాణాలు, రిజిస్ట్రేషన్ లు, ఉపాధి హామీ, తదితర అంశాలపై సోమవారం మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖలు, అధికారుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరు, పాలకొండ పట్టణ గృహ నిర్మాణంలో పురోగతి ఇంకా మెరుగు పడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి లబ్దిదారుని వారీగా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. జగనన్న కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, ఏ లే అవుట్ లో సౌకర్యాలు ఇంకా సమకూరలేదో వెంటనే వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాలకు ఎటువంటి ఆటంకాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. భామిని, మక్కువ, పాచిపెంట మండలాల్లో తక్కువ వేతనాలు నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాచిపెంట మండలంలో 3.71 లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఉందని అయితే 2.50 లక్షలు మాత్రమే సాధించారని ఆయన పేర్కొన్నారు. సరాసరి వేతనం రూ.140 ఉందని, దానిని కనీసం రూ.180 కు పెరగాలని ఆయన స్పష్టం చేశారు. సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమంను ఆన్ లైన్ చేయాలని ఆయన ఆదేశించారు.562 సేవలు సచివాలయం ద్వారా అందిస్తున్నామని అయితే భామిని, కొమరాడ, సీతంపేట తదితర మండలాల్లోని కొన్ని సచివాలయాల నుండి సేవలు అందించడం జరగలేదని అందుకు కారణాలు తెలియజేయాలని ఆయన ఆదేశించారు. స్వచ్ఛ సంకల్ప గ్రామాలు నేలకొనాలని గ్రామ పంచాయతీ స్థాయిలో ముమ్మర చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలలో జాప్యం జరగటానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. పాలకొండ నియోజకవర్గం మండలాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు.
జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. మ్యూటేషన్లు ఎప్పటి కప్పుడు చేసి డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కూర్మి నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గిరిజన సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, ప్రభాకర రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, గృహ నిర్మాణ సంస్థ ఇఇ శ్రీనివాస రావు, సర్వే అధికారి రాజు కుమార్, ప్రజా ఆరోగ్య శాఖ డిఇఇ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.