Close

District Collector Nishant Kumar said there should be a comprehensive health activity within the primary health centers

Publish Date : 30/05/2022
District Collector Nishant Kumar said there should be a comprehensive health activity within the primary health centers

*సమగ్ర అరోగ్య కార్యాచరణ ఉండాలి*

పార్వతీపురం, మే 27 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సమగ్ర అరోగ్య కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవల కేంద్రంగా పి.హెచ్.సి విరాజిల్లాలని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శుక్ర వారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య అధికారులు కేవలం ఓపి డాక్టర్ గా కాకుండా ఆ ప్రాంత ఆరోగ్య కార్యకలాపాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. పి.హెచ్.సి పరిధిలో జరిగే ప్రతి వైద్య ఆరోగ్య సేవ – మలేరియా, డెంగ్యూ నివారణ, 104, 108 వాహనాల పర్యటన, గాలి, నీరు ద్వారా సంభవిస్తున్న వ్యాధులు, ఇతర అంటు వ్యాధుల నియంత్రణపై పటిష్ఠమైన పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. సీజన్ వారీగా ప్రభలే వ్యాధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి జిల్లా యంత్రాంగానికి, సమాజానికి సకాలంలో సరైన సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో వ్యాధుల చరిత్రపై అవగాహన ఉండాలని ఆయన చెప్పారు. శీతాకాలంలో నిమోనియా వంటి వ్యాధులతో శిశు మరణాలు., మే, జూన్ నెలల్లో నీటి సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ఆయన ఉదహరించారు. ప్రతి అంశంపై పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిపాలనా బాధ్యతలు పక్కాగా ఉండాలని, సిబ్బంది విధుల నిర్వహణలో అలసత్వం ఉండరాదని ఆయన తెలిపారు. బయో మెట్రిక్ హాజరు పాటించాలని ఆయన ఆదేశించారు. మలేరియా స్ప్రేయింగ్ పర్యవేక్షించాలని, స్ప్రేయింగ్ ఇంటి లోపల, బయట విధిగా చేయించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులతో ఒక్క మరణం కూడా సంభవించరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రికాషనరి కోవిడ్ వాక్సినేషన్ జరగాలని అన్నారు. ఆరోగ్య అంశాల పట్ల ఏ.ఎన్.ఎం వారీగా సమీక్షించాలని ఆయన ఆదేశించారు.
ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని, మాతా శిశు మరణాలు సంభవించరాదని ఆయన పేర్కొన్నారు.
హై రిస్క్ డెలివరీలను ముందుగా గుర్తించాలని ఆయన ఆదేశించారు.ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎంలు క్రియాశీలకంగా పనిచేయడం ద్వారా గర్భిణీలను గుర్తించి నమోదు చేయాలన్నారు. ఇంటికి వెళ్ళి సర్వే చేయాలని సూచించారు.ఆన్ లైన్ విధానంలో నమోదు చేయాలని సూచించారు.మండల స్థాయిలో ప్రతి నెల మూడవ రోజున అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎంలతో సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ప్రణాళికాబద్ధంగా స్లాట్ ల వారీగా వారిని పి.హెచ్.సిలకు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ గర్భిణీలను సాలూరు, జి.ఎల్.పురంలో ఉన్న గర్భిణీల ఆసుపత్రుల్లో చేర్చాలన్నారు. రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల నుండి గర్భిణీలను నెల రోజులు ముందుగా బర్త్ వెయిటింగ్ హోమ్స్ లో చేర్చాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు మాట్లాడుతూ ఆసుపత్రి పరిధిలో పెండింగ్ లో ఉన్న కోవిడ్ వాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో రెండు కంటే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని, కుటుంబ నియత్రణను పాటించుటకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.

జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు మాట్లాడుతూ కొమరాడ, మక్కువ, పాచిపెంట, బలిజిపేట, అరసాడ, రావివలస, సీతానగరం, పెద బొండపల్లి తదితర పి.హెచ్.సిలలో స్ప్రేయింగ్ తదితర కార్యక్రమాల్లో శ్రద్ద వహించాలని అన్నారు.

జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, డెప్యూటీ డిఎంహెచ్ఓ అనిల్, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.