Close

MV Krishna Babu, chief secretary, state medical health department, said the Covid vaccination program should be carried out.

Publish Date : 27/05/2022
MV Krishna Babu, chief secretary, state medical health department, said the Covid vaccination program should be carried out.

*కోవిడ్ వాక్సినేషన్ జరగాలి*

పార్వతీపురం, మే 26 : కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె నివాస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, అర్హులైన అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. గతంలో ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో స్ప్రేయింగ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. నవంబరు, డిసెంబరు సమయంలో నిమోనియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వాటిపై అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సూత్రాలు, అంటువ్యాధులపై సంతలలో అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.