* Dream of owning a home must come true * – District Collector Nishant
*సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి*
– జిల్లా కలెక్టర్ నిశాంత్
పార్వతీపురం (పాచిపెంట), మే 25 : సొంత ఇంటి కల నిజం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. పాచిపెంట మండలం గురివి నాయుడు పేట జగనన్న కాలనీ లేఅవుట్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, గురువి నాయుడు పేట, పాంచాలి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. జగనన్న కాలనిలో మంజూరు అయిన ఇల్లు, వాటి నిర్మాణ దశల వివరాలను హౌసింగ్ ఏఈ అప్పల నాయుడు ను కలెక్టర్ ప్రశ్నించగా 95 ఇల్లు మంజూరు కాగా 95 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. హౌసింగ్ బిల్లుల చెల్లింపులు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఐరన్, ఇటుకలు వంటి సామాగ్రి అందించడంలో ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బంది లేదని లబ్ధిదారులు తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరితగతిన ఇంటి పైకప్పు స్థాయి వరకు ఇళ్ల నిర్మాణాల పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే మంచి ఆశయంతో ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో 24,619 గృహాలను మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 330 జగనన్న కాలనీల్లో 11,983 గృహాలు మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పాచిపెంట మండలంలో 39 కాలనీల్లో 451 గృహాలు మంజూరు చేశామని కలిసి తెలిపారు. కాలనీలను ప్రణాళికాబద్ధంగా వేయటం జరిగిందని, అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. లబ్దిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని పిలుపనిచ్చారు. ప్రస్తుతం నిర్మాణాలకు అనుకూలమైన సమయమని ఆయన అన్నారు. గృహాలను నిర్మించడం వలన లక్షల రూపాయల విలువ చేసే ఆస్తిని సొంతం చేసుకోగలరని పేర్కొన్నారు.
సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ గ్రామ సచివాలయంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ హాజరులను పరిశీలించారు. అర్హులైన వారికి రైతు భరోసా పథకం అందని రైతులు ఉన్నారా అని ఆరా తీశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ ప్రశ్నించగా స్లాబ్ దశలో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంపై ఆరా తీస్తూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని, అర్హులైన అందరికీ బూస్టర్ డోస్ వేయాలని ఆదేశించారు.
*స్వచ్చ గ్రామాలు ఆవిర్భావం కావాలి*
జిల్లాలో ప్రతి గ్రామం స్వచ్చ గ్రామం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. గురివి నాయుడు పేటలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలించిన కలెక్టర్ “చెత్త నుండి సంపద తయారీ కేంద్రం” వినియోగంలో ఉండాలన్నారు. ప్రతీ రోజు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రజల్లో తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రాలు సేంద్రియ ఎరువుల ఉత్పాదనలో ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ కె. రవీంద్రనాథ్, సర్పంచులు జి.చిట్టెమ్మ, జి.యుగంధర్, తాసిల్దార్ కె.రామచంద్ర రెడ్డి, ఎంపీడీఓ రాధాకృష్ణ, పంచాయతీ రాజ్ డిఈ డి.చిన్నంనాయుడు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.