District Collector Nishant Kumar started his rule from his chamber in the Collector’s office.
*ఛాంబర్ లోకి జిల్లా కలెక్టర్*
పార్వతీపురం, మే 12 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ నుండి పాలన ప్రారంభించారు. గురు వారం మధ్యాహ్నం లాంఛనంగా కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో కలెక్టర్ ఆసనంలో ఆసీనులయ్యారు. ఛాంబర్ లో సాధారణ మార్పులు, చేర్పులు చేయడం వలన ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాలన సాగించారు. ఛాంబర్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడంతో గురు వారం నుండి ఛాంబర్ లోకి మారారు. దీంతో జిల్లా పరిపాలనా భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ ఛాంబర్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్, జిల్లా రెవిన్యూ అధికారి, పరిపాలన అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాలుతో పాటు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరం, స్పందన హాల్ సిద్ధం అయ్యాయి.
పరిపాలన భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు మంచి సేవలు అందించుటకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. నూతన జిల్లాగా పార్వతీపురం ఏర్పాటు కావడం, జిల్లాకు మొదటి పాలనాధికారిగా రావడం ఆనందంగా ఉందని, మొదటి పాలనా బృందంగా మంచి సేవలను ప్రజలకు అందించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయుటకు అడుగులు వేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.