Close

District Collector Nishant Kumar said roads in the district should be home to safe travel.

Publish Date : 23/05/2022
District Collector Nishant Kumar said roads in the district should be home to safe travel.

*రహదారులు సురక్షితం కావాలి*

* మానవతామూర్తులకు రూ.5 వేలు

పార్వతీపురం, మే 20 : జిల్లాలో రహదారులు సురక్షితం ప్రయాణానికి నిలయాలుగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రతి ప్రాణం ఎంతో విలువైనదని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం గిరి మిత్ర సమావేశ మందిరంలో శుక్ర వారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతా చర్యలు పక్కాగా చేపట్టాలన్నారు. రహదారి భద్రత కమిటీ పటిష్టంగా పనిచేయాలని ఆయన చెప్పారు. ప్రమాదాలు జరుగుతున్న స్థలాలు, జరుగుటకు అవకాశం ఉన్న స్థలాలు గుర్తించాలని ఆయన ఆదేశించారు. రహదారులపై ప్రమాదకర గోతులు, టర్నింగ్ లు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రమాదాలు జరుగుతున్న తీరును గుర్తించి అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే రహదారుల పైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని పేర్కొంటూ వాహనాలు నడిపే వారు తమ కుటుంబాలను గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. సుదీర్ఘ కాలం వాహనం నడపడం వలన బి.పి, పల్స్ వంటి అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయని కావున వాహనాలు నడిపే వారు కొంత విశ్రాంతి తీసుకోవాలని, ముఖం కడగాలి అందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రహదారి ప్రమాదాలపై లఘు చిత్రాలు నిర్మించి విద్యా సంస్థలలో ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. కొన్ని ప్రదేశాల్లో వివిధ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేస్తున్నారని తద్వారా వాహనదారులకు ఎదురుగా ఉన్న రహదారి కనిపించక ప్రమాదాలు జరుగుతాయని, వాటిని తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ట్రామా కేర్ కేంద్రం ఉండాలని ఆయన అన్నారు. హాట్ స్పాట్ జాబితాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

జిల్లా రవాణా శాఖ అధికారి పి.వి. గంగాధర రావు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐఆర్డిఎ యాప్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రుల్లో చేర్చడం, సమాచారం అందించే మానతామూర్తులు (గుడ్ సమారిటన్)కు రూ.5 వేల పారితోషికం అందించుటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అటువంటి వారికి అవార్డును అందించుటకు సిఫారసు చేయవచ్చని ఆయన తెలిపారు. రామభద్రాపురం – సుంకి వరకు జిల్లాలో జాతీయ రహదారి 18 కిలో మీటర్ల మేర ఉందని అన్నారు. పార్వతీపురం పట్టణంలో పలు ప్రాంతాల్లో డివైడర్లలో మార్పులు చేయాలని, కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు పెట్టాలని సూచించారు.

ఏఎస్పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు.

డి.ఎస్.పి శ్రావణి మాట్లాడుతూ డివిజన్ లో 16 బ్లాక్ స్పాట్ లు ఉన్నాయన్నారు.

లారీ యజమానులు సంఘం అధ్యక్షులు వెంకట రమణ మాట్లాడుతూ బై పాస్ రహదారి నిర్మాణం అవసరమని, 1974 సంవత్సరంలో ప్రతిపాదించారని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, ప్రజా రవాణా మేనేజర్ యస్.వి.సుధాకర్, రహదారులు, భవనాల శాఖ ఇఇ ఎం. జేమ్స్, జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, ఆర్.టి.ఏ పాలన అధికారి సీతారామ్, తదితరులు పాల్గొన్నారు.