Close

District Collector Nishant Kumar directed the authorities to remain vigilant in the wake of Asani storm.

Publish Date : 12/05/2022
District Collector Nishant Kumar directed the authorities to remain vigilant in the wake of Asani storm.

*అసని తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి*

పార్వతీపురం, మే 11 : అసని తుఫాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. అసాని తుఫానుపై రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధ వారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కడా ఒక్కరూ కూడా మృత్యువాత పడరాదని ఆయన స్పష్టం చేశారు. గరుగుబిల్లి, బలిజిపెట, మక్కువ మండలాల్లో అధిక వర్ష పాతం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందుగా అప్రమత్తం చేయాలని, సాలూరు పట్టణంలో నీటి నిల్వ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో ప్రసవం జరిగే గర్భిణీలకు ముందస్తు చర్యలు మేరకు గర్భిణీల వసతి గృహాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు కారణంగా గండ్లు పడే రహదారులు, బ్రిడ్జిలను తహశీల్డార్, సబ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలని, అటువంటి ప్రదేశాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాగు నీటి పథకాల నుండి నీటి సరఫరా సమస్య లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు. నూర్పిడులు పూర్తి అయిన ధాన్యం భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు. తుఫాన్ సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్దరణకు అవసరమగు స్తంభాలు సిద్దంగా ఉంచాలని చెప్పారు. తుఫాను సమయంలో విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి కమ్యూనికేషన్ ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, జిల్లా సరఫరా అధికారి మధు, జిల్లా అగ్ని మాపక అధికారి శ్రీను బాబు, జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఆర్. అప్పల నాయుడు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూర్మి నాయుడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.